# Tags

ఆంధ్రప్రదేశ్ అప్పులపై తప్పుడు లెక్కలు ఎవరివి?

Ap Appulu

జగన్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి, రాష్ట్రాన్ని ముంచేస్తోందని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. ఇదిగో ఇన్ని లక్షల కోట్లు వైసిపి ప్రభుత్వం ఇప్పటిదాకా అప్పు చేసింది అని ప్రతిపక్షాలు అంటుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పే అంకెలతో పొంతన కుదరదు.

“చూశారా, గత ప్రభుత్వం కంటే మేం చాలా తక్కువ అప్పులు చేశాం, కేంద్రం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. కావాలని ప్రతిపక్షాలు, విమర్శకులు అల్లరి చేస్తున్నారు,” అని అధికార పక్ష నాయకులు ఎదురుదాడి చేస్తారు.

తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఏపి అప్పులు 10 లక్షల 70 వేల కోట్లు దాటాయని, ఒక్క వైసిపి ప్రభుత్వమే ఈ నాలుగేళ్లలో 7 లక్షల కోట్లకి పైగా అప్పులు చేసిందని ఆరోపించారు.

అదే సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇదే అంశం మీద పార్లమెంటులో ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు 2023 మార్చి నాటికి బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లుగా ఉందని తెలిపారు.

అప్పుల విషయంలో ఈ గందరగోళం ఏమిటి? ఈ గందరగోళం ఎందుకు ఏర్పడింది? వాస్తవాలేంటి?

2014లో టిడిపి అధికారం చేపట్టేనాటికి నవ్యాంధ్రప్రదేశ్ అప్పులు 97 వేల కోట్ల రూపాయలు.

రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం, వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి, అంటే 2019 నాటికి,  ఆంధ్రప్రదేశ్ అప్పులు 2 లక్షల 64 వేల కోట్ల రూపాయలైంది. అంటే టిడిపి ఐదేళ్లలో చేసిన అప్పు లక్షా 65 వేల కోట్లు అన్నమాట.

కేంద్ర మంత్రి చెప్పిన లెక్క ప్రకారం, వైసిపి గడిచిన నాలుగేళ్లలో అధికారికంగా చేసిన అప్పు 2 లక్షల 39 వేల 716 కోట్లు. అంటే టిడిపి ప్రభుత్వం ఏడాదికి సగటున 33 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందన్న మాట. అదే వైసిపి ప్రభుత్వం ఏడాదికి సగటున 44 వేల కోట్ల రూపాయల అప్పు చేసిందన్న మాట. అంటే టిడిపి హయాంతో పోలిస్తే, వైసిపి ఏటా 10 వేల కోట్ల రూపాయల అప్పు ఎక్కువ చేస్తోంది. ఈ అప్పులన్నీ రిజర్వు బ్యాంకు ద్వారా చేసే అప్పులు.

కాని అసలు విషయం అది కాదు. టిడిపి ప్రభుత్వమైనా, వైసిపి ప్రభుత్వమైనా బడ్జెట్ లో చూపించకుండా అప్పులు చేస్తున్నాయి. వీటిని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు. అంటే ఏ కార్పోరేషన్ పేరు మీదో అప్పు చేసి, అది ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టు చెబుతారు. కాని ఇటువంటి అప్పులకు కూడా ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. అంటే చివరకి ప్రభుత్వం – అంటే ప్రజలు – ఈ అప్పుల్ని, వాటికి వడ్డీల్ని కట్టాల్సిందే. అలాగే, కాంట్రాక్టర్లకి, ఇతరులకి కూడా భారీ ఎత్తున బాకీలు పెడుతున్నారు. దీర్ఘకాలంలో వీటిని కూడా అప్పులు కింద భావించాల్సిందే. అయితే రాష్ట్ర బడ్జెట్ లెక్కల్లో ఇవన్నీ చూపడం లేదు కాబట్టి, వీటిని అప్పులుగా కేంద్రంగా గుర్తించడం లేదు. అంతమాత్రం చేత ఇవన్నీ అప్పులు కాకుండా పోవు.

ఈ రకంగా చూసినప్పుడు, టిడిపి అధికారంనుంచి దిగిపోయే నాటికి అన్ని అప్పులు కలిసి 3 లక్షల 62 వేల 375  కోట్ల భారం ఉంది. అంటే, అంతకుముందు ఉన్న అప్పు 97 వేల కోట్లు (1956 – 2014 వరకు), టిడిపి ప్రభుత్వం చేసిన అప్పు 2,65,365 కోట్లు అన్నమాట.

ఇదే లెక్క ప్రకారం, వైసిపి ఈ నాలుగేళ్లలో చేసిన అప్పులు, చెల్లించాల్సిన బాకీలు అన్నీ కలిపి 7 లక్షల 14 వేల 631 కోట్లు ఉంది. ఇందులో ఏపి అభివృద్ధి కార్పోరేషన్ పేరుతో తీసుకున్న అప్పులు, భవిష్యత్తు మద్యం అమ్మకాల్ని కూడా తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులు, ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులు ఉన్నాయి. అందుకే వైసిపి ఈ నాలుగేళ్లలో తీసుకున్న అప్పుతో సహా ఏపి మొత్తం అప్పు 10 లక్షల 70 వేల కోట్లకు పైగా ఉందని ప్రతిపక్షాలు చెబుతోంది.

ఈ ప్రభుత్వానికి ఇంకో ఏడాది సమయం ఉంది. అంటే, ఈ లెక్కన ఈ ఏడాది మరొక లక్షా 60 వేల కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది.

దీన్ని బట్టి, ఏ స్థాయిలో వైసిపి అప్పులు చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రానికి ఏటేటా వచ్చే ఆదాయంలో దాదాపు మూడో వంతు బాకీలకి, వాటి వడ్డీలకి చెల్లించాల్సిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అందుకే ప్రజల మీద ముందు ముందు పన్నులు ఇంకా పెరుగుతాయి.

Article Credits – Ap News Live 

TAGGED :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *